30, జూన్ 2018, శనివారం

Dark Fantasy

Dark Fantasy :

ఎర్రటి చుక్కల చిక్కులు విడుచుకుంటున్న
ఉదయపు రెక్కల దేహమెుక నిరంతర యాత్రిక
టెంపరరీ డెస్టినేషన్ల కాలపు సంకెళ్ళ గదులు
ఆమె కళ్ళు తెరిచినపుడల్లా ఎగరటానికి విలవిల్లాడుకున్న ఓ పావురపుపిల్లే.

ఎందుకెలా మెుయ్యాలో తెలిసీ తెలియని
అనవసరపు అవసరాల ఆకళ్ళ రంగులని మోస్తూ ఆ కళ్ళు
ఏదో చెప్పాలని చూసి జలజలా కారిపోతాయి అలల్లా
సగం ఆరిన నిప్పుల బాధ, వేడి రెప్పల చప్పుడు నిశ్శబ్ధంగా అరిచింది 
బేబీ, యువార్ డిపెండెన్ట్లీ ఇండిపెండెంట్ .
ఇంటర్డిపెన్డెన్సీ, బాధ్యతా బతుకుల్లో జన్మహక్కులుగా
అణగదొక్కబడిన అంతర్యుద్ధాల అబద్ధపు నిజం

కాలరాయలేని, కాలంతో పరిగెత్తనూలేని పరాజిత
నీ గెలుపెవరికీ అక్కర్లేకున్నా ఆకాశాన్నలా నింపుకుంటావు
ఆ చుక్కలొక్కక్కటిగా చీకటిగీతాలుగా రాలుతాయి
చెంపలు తుడుచుకో.. మలిపొద్దో దిష్టిచుక్క

-సరిత భూపతి
30/06/18

25, ఏప్రిల్ 2018, బుధవారం

ఔర్ కుచ్ న జానూ..

ఔర్ కుచ్ న జానూ...

ఒదిలించుకోలేని కలల్లాగానో
ఒదిలించుకోబుద్ధేయని నిజంలాగానో
ఒడిసిపట్టలేనితనంతో పావురం రెక్కకు చుట్టిన ఊహాలోకం
రెక్కలు విచ్చని దేహపు దాగుడుమూతల విరహం

మనసు రెప్పల సుశుప్తల్లో ప్రేమో అడ్రినలిన్
కాలపు మెుప్పలు ఈదే దూరమో అడిక్షన్
గమనమెప్పుడూ నువ్వయినపుడు, ఆ వ్యసనమెుక అలుపులేని చకోరం
యారా! శూన్యపు మౌనం విదిలించిన చినుకులన్నీ
నిర్వచించలేని నిట్టూర్పులే! పచ్చటి దేహాల సాక్షిగా, ప్రేమే!!
దాయేఁ సే పడ్ యా బాయేఁ సే పడ్
ఫర్ష్ సే అర్ష్ తక్ ఇష్క్ హై లిఖా

-సరిత భూపతి
25/04/18

17, జనవరి 2018, బుధవారం

Transparency

Transparency:

నీ కథ, నా కథ..  వాడూ, వీడూ అందరి కథలన్నీ, శూన్యాల చుట్టలుచుట్టుకుపోతుంటాయి
నెవరెండింగ్ ఎమ్టీనెస్ లను కాల్చలేని భోగిమంటలు
కొలనిదోపరికి గొబ్బిళ్లో.. క్రియేటివిటీ కట్టేసిన వాకిళ్లో
ఫరెవర్ స్వేచ్ఛల లుక్కులిచ్చేసి, దారాలకు బంధీలయిన గాలిపటాలం.. అలా ఎగురుతుంటాం
నీ నుంచి నీలోకి దాటుతున్న పారదర్శకత్వంలో
వెతుక్కున్న నిన్నో, కోల్పోతున్న నిన్నో..మిగిలేదైతే నువ్వే. జీరో ఇన్ టూ ఎనీథింగ్ ఈక్వల్స్ టూ జీరో
పూర్ణ మదః పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతి..మరి, నీకు నువ్వే గతి
నేర్చుకో, ఇదం నేర్పుతున్న ఈశావాస్యోపనిషత్తులు
కాలంతో జారిపోతున్న కన్నింగ్ స్క్రిప్ట్ లకు
లైఫో కామెడీ స్కిట్
ఫికర్ మత్, లాఫ్ ఎట్ యువర్ పెయిన్
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఇరుకున పడుతుండటమే ఇహం అని గుర్తించు, ఇందీవరాక్షా!
ఇహ పాడుకో..సాగిపో
తప్పటడుగో, తప్పు అడుగో..తప్పదే! తప్పుకుపోదాం,తక్షణం !!

-సరిత భూపతి
17-01-18

5, జనవరి 2018, శుక్రవారం

నీ తలపులలో...

మబ్బుల్లో దాగుడుమూతలాడుతున్న చంద్రుడిలా నువ్వు
అమావాస్య ముసుగుల్లో నీ కోసం వెతుకుతూ నేను
తెరలుతెరలుగా దిగివస్తూ, నువ్వేనా..? నా నువ్వేనా...!
తొలి చూపుల సంశయం..
ఇంతలోనే మెదడుకో వెలుతురు రేఖ
నీవు వచ్చేవని..నీ పిలుపే విని..
పలకరింపులూ మరచి, చూస్తుండిపోయానా? ఏమో!!

నా కలవరింతల్లోని నిన్ను దాటి, తిరగి నీ దగ్గరికి తీసుకురావటానికీ, మళ్ళీ అది నువ్వే అయ్యుండాలి
నన్ను నిదుర లేపటం నీకు కొత్తేమీ కాదుగా
నన్ను ఇహానికి లాక్కొచ్చిన నీ స్పర్శే మెత్తని సూదిలా, ఓ సుప్రభాతం
నీ పక్కన నిలుచున్నానా? గాలిలో తేలానా??

నాకు చదవటం ఎప్పటికీ ఆపబుద్ధేయని, నాలుగు కళ్ళ చూపు
చూపేనా ?.. విరితూపేనా..!?
ఆ నవ్వెంత స్వచ్ఛం!
నువ్వెంత సౌమ్యం!!
అరచేతుల సిగ్గులకు , నువ్వో ఎర్రటి చుంబనం
పంచుకున్న చాక్లెట్ ముద్దులో
రెండు కపోతాల కౌగలింతల కావ్యం
ఇవాల్టిక ఆఖరు మరి.. అనాలనిపించని క్షణాల్లో,
ఈసడించుకుంటున్న కాలమెుక దిష్టిచుక్క

నిన్నెన్నిసార్లు చూసినా, అది అసంకల్పిత ప్రతీకారచర్యంత యాధృచ్ఛికం, నవీనం ..

ఆ ఎండలు, నీ నీడలూ..
బుుతువులన్ని నాకిచ్చేసిన, నీకేమిచ్చుకోనూ!?
కనులే నావి..కలలన్నీ నీవేగా!
ఘడియయేని, ఇక విడిచిపోకుమా, మెలకువలోనైనా... ❤


6, డిసెంబర్ 2017, బుధవారం

మారణకాండ

// మారణకాండ //

" యత్ర నార్యస్తు పూజ్యంతే.... "
అరిగిపోయిన రాతలకో ఫోర్ వర్డ్ అయిపోతుంది
"ధర్మేత్వయా ఏషా నాతిచరితవ్య" బాసలు
ఆమె కిరోసిన్ దేహానికో అగ్నిహోత్రం
శుక్రకణం మాత్రమే నిరూపించగలిగే మగతనం

విక్టిమ్స్ కి నీతులు చెప్పే లోకమిపుడు,
ఐదేళ్ళ ఆడపిల్లలు ఏ బట్టలేసుకోవాలో నేర్పటానికి
ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెడుతుంది
ఈలోగా, రోడ్డు మీద నెత్తరోడుతున్న ఓ పిచ్చిది
మతిస్థిమితం లేనందుకు మెుదటిసారిగా నవ్వి,
శవమైపోతుంది

చట్టం గాంధారీతనానికి ఆనందపడుతుంది
ప్రతిఘటించలేని ద్రౌపదుల ఆర్తనాదాలు గాలిలో
కలిసిపోతాయి
ఇంకేం రండి మరి! యోనుల రక్తాక్షరాలు ఉదయం పేపర్లో చదువుకుందాం, ఎప్పట్లాగే...హ్మ్!

-సరిత భూపతి
6/12/17

19, అక్టోబర్ 2017, గురువారం

చీకటి

// చీకటి //

తిమిరాన్నంతా తన వద్దే దాచేసుకొని
ప్రపంచానికి వెలుగులా చూపుకుంటున్న దీపం గురించి ఇపుడేం చెప్పనూ?

కొన్ని చీకట్లను ఎవరూ గుర్తించలేరు
నలుపులు పులుముకుంటున్న పర్వర్టెడ్ అథారిటీలకు
లోలోపలి తిమిరాన్ని ఎప్పటికీ వెలిగించలేనని
చూపాలనిపించుకోని సహజత్వం

వెలిగే దీపాల్లా కనిపించే నవ్వులన్నీ
నువ్వు చూడగలిగేవి మాత్రమే,
తన లోపలి చీకట్ల ప్రతిబింబాలే

చిమ్ము చీకటిలో లోకానికి వెలుగైన
ఓ గుడ్డిదీపపు లోపటి నలుపు
బయట మతాబుల శబ్ధానికి ఓసారి ఉలిక్కిపడింది
అవును, కొన్నిసార్లంతే..
      కొందరి ఆనందమూ, కొందరికి చివుక్కుమనేలా చేస్తుంది
అంధకారం లోకంలో కాదు
నీ లోపల అని అమావాస్య రాత్రి వెక్కిరించిపోతుంది

-సరిత భూపతి
19.10.17

9, అక్టోబర్ 2017, సోమవారం

patterns

// patterns //

రాలిపోతున్న ఉదయాలనో
వాడిపోతున్న పూలనో తలుచుకొని
ఒక సాయంత్రం కుమిలిపోతూ వుంటుంది
వేకువల కోసం ఆలోచించలేని కళ్ళు
మోడైపోయిన చెట్ల కింద
ఆకులు విడిచిన ముద్రలకు ఇపుడెక్కువగా విలపిస్తాయి
సరిగ్గా అపుడనుకుంటాను
నాతో లేవన్న విరహాల కంటే
నాలో వున్న జ్ఞాపకాల సాంద్రత ఎక్కువ కదూ అని !
అవును.. నువ్వు రాలేవన్న నిజం కంటే
నీ ఊసుల సజీవత్వమెప్పటికీ ఎనలేని సంతోషం

ప్రేమించబడాలనే ఆశలు లేని
డిటాచ్డ్ అటాచ్మెంటో విడువని తృప్తి
ఆజ్ రుస్వా తేరి గలియోఁమే మెుహాబ్బత్ హోగీ
అని శాపనార్థమేమీ పాడలేను కానీ
నువు రాక ముందు జీవితం గురుతైనా లేని
ఈ క్షణమెంతో హాయి

-సరిత భూపతి
9/11/17